Close

వివిధ జిల్లాల రైస్ మిల్లర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్.

Publish Date : 23/04/2025

ఏలూరు,ఏప్రిల్,23: రబీ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రైస్ మిల్లర్లు మానవతా ధృక్పధంతో వ్యవహరించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ స్పష్టం చేశారు.

బుధవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్రంలోని పలు జిల్లాల రైస్ మిల్లర్ల ప్రతినిధులు, ఎగుమతి
దారులతో రబీ ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్ సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకు మించి రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి విషయంలో రైతులకు మంచిచేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు. ఈ సమయంలో రబీ ధాన్యం కొనుగోలులో బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వంతో రైస్ మిల్లర్లు కూడా భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. అంతిమంగా రైతాంగం కోసం పెద్దమనస్సుతో మనస్పూర్తిగా రైస్ మిల్లర్లు పనిచేయాలని కోరారు. ఈ విషయంలో ఎటువంటి సహకారం అవసరమైనా అందిస్తామన్నారు. క్షేత్రస్ధాయి, జిల్లాలో ఉన్న ఇబ్బందులను తెలుసుకొని రైతులకు మేలు జరిగేలా చురుకుగా కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించాలని కోరారు. రానున్న వాతావరణ పరిస్ధితులు దృష్టిలో ఉంచుకొని రైతులనుంచి ధాన్యం కొనుగోలును ముమ్మరం చేయాలన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోను చేయనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అదే విధంగా రబీ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రణాళిక బద్దంగా వెళ్లాలన్నారు. గోనె సంచుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ప్రత్యమ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు టార్గెట్ విషయంలో ఎటువంటి అపోహలకు తావివ్వరాదన్నారు. ధాన్యం కొనుగోలులో కనీస మద్దతు ధరకు కట్టుబడి వుండాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ డా. మనజీర్ జీలానీ సమూన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్ గౌర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, పౌర సరఫరాల సంస్ధ డిఎం శివరామమూర్తి, డిఎస్ఓ వై. ప్రతాప్ రెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన రైస్ మిల్లర్లు పాల్గొన్నారు