ఇంతవరకు రూ. 206.7 కోట్లు చెల్లింపు.. రభీధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.,
ఏలూరు,ఏప్రిల్, 28 : ఏలూరు జిల్లాలో 2024-25 రభీ సీజన్ కు సంబంధించి 12,380 మంది రైతుల నుంచి 1,55,529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు. సోమవారం స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో రబీధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. రైతుల నుంచి ఇంతవరకు 359.27 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా అందులో ఇంతవరకు 206.71 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఆధార్ అనుసంధానిత ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. మిగిలిన 150.30 కోట్లు రూపాయలు జమచేయు ప్రక్రియలో ఉందన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించిన 126 రైతు సేవాకేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఏజెన్సీల ద్వారా ఎఫ్ఎ క్యూ నిబంధనల ప్రకారం విక్రయించుకుని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర పొందవచ్చన్నారు. రైతుల యొక్క శ్రేయస్సు కొరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ఏజెన్సీల వద్ద గోనెసంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధంచి రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఫిర్యాదులు చేయుటకు జిల్లాస్ధాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08812-230448, 7702003584, 7569562076 నెంబర్లకు తెలియజేయవచ్చన్నారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజరు పి.ఎస్.ఆర్. మూర్తి, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి తదితరులు పాల్గొన్నారు.