Close

ఏలూరు జిల్లాలోని అధికారులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దిశా నిర్దేశం భారీ వర్షాలు, ఈదురు గాలులు కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకూడదు

Publish Date : 04/05/2025

ఏలూరు, మే, 4 : భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు తీసుకోవలసిన చర్యలపై వివిధశాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జన జీవనం స్తంభించకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చాలా ప్రదేశాలలో చెట్లు నేలకూలాయని, విద్యుత్ స్థంబాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, అధికారులు యుద్ధప్రాతిపదికన వెంటనే స్పందించి జెసిబి ల సహాయంతో చెట్లు తొలగించి రవాణాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అదేవిధంగా విద్యుత్ లైన్లకు మరమ్మత్తులు చేసి, విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్దరించాలన్నారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలన్నారు. గ్రామాలూ, పట్టణాలలో శిధిలావస్థలో ఉన్న భవనాలు, కట్టడాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈదురు గాలులకు ప్రచార హోర్డింగ్ లు వంటివి కూలి పోకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం తడిసిపోకుండా ఉండేలా రైతులకు టార్పాలిన్లు అందించాలన్నారు. కూలిపోయిన చెట్ల కారణంగా ట్రాఫిక్ నకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కూలిన చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు వైద్య సేవలందించాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా పశు నష్టం జరిగితే వెంటనే నివేదిక అందించాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జిల్లాలో మీడియా గ్రూప్ లలో వచ్చే అంశాలను పరిగణనలోనికి తీసుకుని, తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాలలోని అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, పూర్తిగా పారిశుధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.