2025-26 పొటెన్సియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కరదీపికను ఆవిష్కరించిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు, ఏప్రిల్,30 : జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూపొందించిన జిల్లా పొటెన్సియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల సమన్వయంతో రూపొందించిన పిఎల్ పిని బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. నాబార్డు సంభావ్యత రుణ ప్రణాళిక లో ప్రాధాన్యతా రంగం కోసం రూ.17,785 కోట్ల అంచనాతో రుణ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక, ఆర్థిక సహాయం మరియు యూనిట్ వ్యయాల స్థాయి, క్షేత్రస్థాయి రుణ ప్రవాహం యొక్క సరళి, క్షేత్రస్థాయిలో మారుతున్న విధానాలు మరియు ప్రస్తుత మౌలిక సదుపాయాల సూచిక మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించబడిందన్నారు. అంతేకాకుండా, ప్రాధాన్యతా రంగాల క్రింద అందుబాటులో ఉన్న రుణ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు బ్యాంకులు పరిష్కరించాల్సిన మౌలిక సదుపాయాల అంతరాలు మరియు చేపట్టవలసిన కీలకమైన చర్యల సమాచారం కూడా ఇందులో పొందుపరచబడిందన్నారు.
ప్రాధాన్యతా రంగం కోసం మొత్తం అంచనా రూ. 17,785 కోట్లగా వేయబడింది, ఇందులో మొత్తం వ్యవసాయ రంగానికి రూ. 11,282 కోట్లగా అంచనా వేయగా , ఇది మొత్తం అంచనాలో 63%. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రుణం రూ.3,633 కోట్లగా అంచనా వేయబడింది. ఎగుమతుల రంగానికి రూ.147.90 కోట్లు, విద్య రంగానికి రూ. 83.70 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ. 534.64 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలకి రూ. 46.63 కోట్లు, పునరుత్పాదక శక్తి రూ. 12.70 కోట్లు మరియు ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ. 1106.09 కోట్లగాను,అంచనా వేయబడింది.
కార్యక్రమంలో నాబార్డు డిడిఎం టి.అనిల్ కాంత్, వ్యవసాయ శాఖ జెడి హబీబ్ భాషా, డి ఆర్ డి ఏ పిడి ఆర్. విజయరాజు, ఎల్డిఎం డి. నీలాద్రి, జిఎం డిఐసి సుబ్రహమణ్యేశ్వరరావు, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ కె.బాబ్జి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.