ఆర్.టి.సి. బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు,మే,27: ఏలూరు ఆర్.టి.సి. బస్టాండ్ లో మరింత పరిశుభ్రత చోటుచేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్ టిసి అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.
మంగళవారం ఏలూరు కొత్త బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు బస్టాండ్ లోని ప్లాట్ ఫారమ్ లను పరిశీలించారు. బస్టాండు పిల్లర్లపై ఉన్నటువంటి బస్సుల సమయ వేళలను తనిఖీ చేశారు.బస్టాండ్ లోని పలుస్టాల్స్ ను సందర్శించి స్టాల్స్ లో ఉన్న తినుబండారాల ప్యాకెట్లపై తయారీ, ముగింపు(ఎక్స్ఫైరీ) తేదీలను పరిశీలించారు.
అక్కడనుండి విచారణ కేంద్రాన్ని సందర్శించారు. బస్టాండ్ లోని క్యాంటిన్ కు వెళ్లి వంటశాలలో ఆహార పదార్ధాల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రయాణికులను క్యాంటిన్ లో తినుబండారాల నాణ్యతను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మరుగుదొడ్ల పరిశుభ్రతని పరిశీలించి, బస్టాండు శుభ్రతకి ప్రయాణికులకి మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆర్ టిసి అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని,శ్రీ సత్య సాయి వాటర్ ప్లాంట్ ని సందర్శించారు. రిజర్వేషన్ కౌంటర్ ని తనిఖీ చేసి రిజర్వేషన్ సౌకర్యాల గురించి ఆరా తీశారు.అలాగే ప్లాట్ ఫారమ్ పై ఉన్న బస్సుల్లోకి ఎక్కి సౌకర్యాలు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.కండక్టర్లు వాడుతున్న టిమ్ మిషన్ల ద్వారా యూపీఐ పేమెంట్ జరుగుతున్నాయా అని అడిగి వారికి తగిన సలహాలు సూచనలు అందించారు.త్వరలో మళ్లీ బస్టాండ్ తనిఖీకి వస్తానని అప్పటికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి. వాణి, బస్ స్టేషన్ మేనేజర్ కె.వి కుమారి, పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు.