Close

వాణిజ్య పన్నులు, తదితర శాఖలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 16/06/2025

ఏలూరు, జూన్, 16 : జిల్లాలో వాణిజ్య పన్నులు వసూళ్లు పెంచేందుకు పక్కా ప్రణాళిక అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం సాయంత్రం వాణిజ్య పన్నులకు సంబంధించి జిఎస్టీ లక్ష్యసాధన, వృత్తిపన్ను వసూలు అంశాలపై వాణిజ్య పన్నులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జిఎస్టీ ఏరియర్స్ 50 కోట్లు రూపాయలు వసూలు చేయాల్సివుండగా ఇంతవరకు 8 కోట్లు రూపాయలు మాత్రమే వసూళ్లు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అదే విదంగా జిఎస్టీ జూన్ నెల వరకు సుమారు 55 కోట్లు రూపాయలు వసూలు చేయాల్సివుండగా కేవలం 10 కోట్లు మాత్రమే వసూళ్ల చేసినట్లు వాణిజ్యపన్నుల శాఖ నివేదించగా దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే సంబంధిత శాఖల ద్వారా సమాచారం పొంది నూరుశాతం లక్ష్యాలు సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు శాఖకు సంబంధించి జిఎస్టీ సంబంధిత పరిశ్రమల పూర్తిసమాచారాన్ని పొందాలన్నారు. కొత్త యూనిట్లు వస్తే సంబంధిత ఉద్యోగుల సమాచారం సేకరించి వృత్తిపన్ను చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిఎస్టీ, ఇతర పాతబకాయిల ఎగవేతదారుల జాబితాను ఆయా బ్యాంకులకు తెలియజేసి సమాచారం అందజేయాలని అటువంటి వారి బ్యాంకు ఖాతాలను నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గనుల శాఖకు సంబంధించి ఇసుక, గ్రానైట్, సిలికాన్ తదితర సరఫరాకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు ఉందిలేనిది పరిశీలించేందుకు పటిష్ట నిఘా ఉంచాలన్నారు. ఈ విషయంలో రవాణా శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ఇంజనీరింగ్ ఏజెన్సీలకు సంబంధించి ఎస్ఓఆర్ ప్రకారం స్ధానికంగా డీజిల్, సిమెంట్, ఐరన్ వంటివి కొనుగోలును ప్రోత్సహించాలని, తద్వారా రాష్ట్రానికి రాబడి తీసుకురావాలన్నారు. అన్ని ఇంజనీరింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ కాంట్రాక్టర్ల పాన్ నెంబర్లు తదితర వివరాలను వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీకి సంబంధించి పిడిఎస్, పిటి వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు. వైద్యులు, న్యాయవాదులు తదితర వృత్తి నైపుణ్యులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో పన్ను వసూళ్లపై దృష్టిపెట్టాలని ఆయా శాఖల వారీగా నిర్వర్తించాల్సిన విధివిధానాలను పంపడంతోపాటు పన్ను వసూళ్లకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం సాయంత్రానికల్లా నివేదిక సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిఎస్టీ ఎగవేతదారుల విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా జిఎస్టీ పాతబకాయిలు, వత్తిపన్ను, వ్యాపారం చేస్తూ జిఎస్టీ రిటన్ అసలు వేయని వ్యాపారవాణిజ్య సంస్ధలపై అసెస్ చేయడం, వాహన తనిఖీలు తదితర అంశాలను లోతుగా పరిశీలన చేయాలని ఆదేశించారు.
సమావేశంలో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమీషనరు రామకోటేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఎల్టిఎం డి. నీలాధ్రి, పరిశ్రమల శాఖ జిఎం. సుబ్రహమణ్యేశ్వరరావు, వాణిజ్యపన్నుల శాఖ అసిస్టెంట్ కమీషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.