Close

ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పై ప్రశంసలు కురిపించిన విద్యార్థి కుటుంబ సభ్యులు

Publish Date : 23/07/2025

ఏలూరు, జూలై 23: ఆయన వయసు 72 ఏళ్ళు.. తన కూతురికి ఇద్దరు పిల్లలు.. సుమారు 15 ఏళ్ల క్రితం ఆమె నుంచి భర్త విడిపోయారు. అప్పటి నుంచి ఆ పిల్లలను ఆయనే పోషిస్తున్నారు. చదివిస్తున్నారు. ఈ క్రమంలో తన రెండో మనవడు తాడిగడప మహేష్ కు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి సీటు కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వద్దకు వచ్చారు. తమకేమీ ఇతర అవసరాలు వద్దని, కేవలం తన మనవడి చదువు కోసం సాయం చేయాలని కోరారు. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కోసం పూర్తి స్థాయిలో దృష్టి సారించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆ పిల్లలకు అండగా నిలిచారు. చదువు కోసం ఏ ఒక్క పిల్లాడు తల్లడిల్లిపోకూడదని ఆమె పలుసార్లు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. కాగా తన మనవడికి సాయం చేయాలని వచ్చిన వృద్ధుడి అర్జీని పరిశీలించి.. తక్షణమే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించారు. ప్రస్తుత రోజుల్లో కనీస అవసరాల కోసం అందరి చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం ఉండటం లేదని.. ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి సాయం అయినా చేస్తారని తెలుసుకుని వచ్చానని తన నమ్మకాన్నినిలబెట్టారని లింగపాలెం మండలం తిమ్మక్కపాలేనికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు బుల్లా నాగేశ్వరరావు తెలిపారు. అడిగిన వెంటనే తమ మనవడి చదువు కోసం కలెక్టర్ కె. వెట్రిసెల్వి సాయం చేశారని ఆయన కొనియాడారు.