వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
ఏలూరు/వేలేరుపాడు,ఆగస్టు 21:వేలేరుపాడు వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గురువారం పరిశీలించారు. వేలేరుపాడు మండలం చిగురుమామిడి సందర్శించి వరద ప్రభావిత బాధితుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గోదావరి వరద నేపధ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపలు పట్టేవారు, రైతులు, పశువుల కాపరులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుతం గోదావరి వరద నీటిమట్టం 51.90 అడుగులుగా భద్రాచలం వద్ద నమోదయిందని కలెక్టర్ చెప్పారు. ఈ వరద నీరు ఏలూరు జిల్లా సరిహద్దుల్లోకి రావడానికి 24 గంటల సమయయం తీసుకుంటుందున్నారు. వరద తీవ్రత దృష్ట్యా వేలేరుపాడు కుకునూరు మండలాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు. వేలేరుపాడు మండలంలో 23 నివాసిత ప్రాంతాలున్నాయని, అన్ని నివాసిత ప్రాంతాల్లో గ్రామాలు బైట ప్రపంచానికి సంబంధాలు తెగిపోయి వున్నాయన్నారు. అయినప్పటికీ అక్కడి వారికి అవసరమైన నిత్యావసరాలు, ఇతర అవసరాలను అధికార యంత్రాంగం కల్పిస్తుందన్నారు. వరద బాధిత గ్రామాల ప్రజలు వారికి కూరగాయలు కావాలని అడిగారన్నారు. వాటిని శుక్రవారం నాటికి అందజేస్తామన్నారు. బాధిత ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాన్ని కుకునూరులోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసి, 150 కుటుంబాలను తరలించామన్నారు. వారికి అన్ని అవసరమైన నిత్యాసరాలు తదితరాలను ఏర్పాటు చేశామన్నారు. వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు సంబంధించి తాగునీటిని రేపటి నుండి టాంకర్ల ద్వారా అందచేస్తామన్నారు. అలాగే మోటార్లు కూడా పంపుతామని చెప్పారు. వరద పరిస్థితిపై ఈ ప్రాంత ప్రజలకు అవగాహన ఉన్నందున వారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు సంబంధాలు తెగిపోయిన గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. వరద సమయాల్లో వచ్చే వ్యాధులను దృష్టిలో వుంచుకుని వారికి వైద్య సౌకర్యం అందించేందుకు ఆశా వర్కర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రాధమిక చికిత్సకు అవసరమైన మందులను కూడా అందచేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో పీహెచ్‌సీల నుండి వైద్యాధికారులను అందుబాటులో వుంచామన్నారు. కుకునూరు మండలంలో వరద ముంపు గ్రామాలైన కొమ్ముగూడెం, లచ్చుగూడెం ప్రజలను దాచారం సహాయ శిబిరానికి తరలించామన్నారు. వారందరినీ ట్రాక్టర్ల ద్వారా శిబిరానికి పంపుతున్నామన్నారు. కుకునూరు మండలంలో మూడు గ్రామాల్లోని ఆరు నివాసిత ప్రాంతాలు గోదావరి వరద వల్ల సంబంధాలు తెగిపోయాయన్నారు. అలాగే వేలేరుపాడులో 23 గ్రామాల్లో 13 నివాసిత ప్రాంతాలు బైట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని కలెక్టర్ వివరించారు. దీనివల్ల మొత్తం 3,690 కుటుంబాలు వరద బాధితులుగా ఉన్నాయన్నారు. ఇందులో 1,222 కుటుంబాలు కుకునూరు, 2,468 కుటుంబాలు వేలేరుపాడు మండలంలో వున్నాయన్నారు.
వీరి వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీవో యం.వి.రమణ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఫిషరీస్ డిడి నరసయ్య, ఎంపీడీవో శ్రీహరి తదితరులు ఉన్నారు.