జిల్లాలో భారీ వర్షాల అప్రమత్తపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

ఏలూరు, ఆగష్టు, 28 : జిలాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎటువంటి నష్టం కలగకుండా తీసుకోవలసిన చర్యలపై గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నదని, రెండవ ప్రమాద హెచ్చరిక వరకు చేరవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో గోదావరి ముంపు ప్రమాద ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రమాదం తొలగే వరకు గ్రామ, మండల స్థాయి అధికారులెవరూ ప్రధాన కార్యస్థానం విడిచి వెళ్లవద్దని, అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవలు మంజూరు చేయవద్దన్నారు. గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించేలోపుగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి ముందుగానే అధికారులు సహాయక చర్యలకు సిద్ధం కావాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నదులు, కాలువలు, చెర్వులలోనికి స్నానం, చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. రిజర్వాయర్ల నుండి వరద నీటిని విడుదల చేసే సమయంలో ముంపునకు గురయ్యే కింద ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే సమయం ఉండేలా నీటి విడుదలకు ముందుగా తెలియజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రమాద ప్రాంతాలలోని గర్భణీలు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్దులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీలను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. తుఫాన్లు, వరదల సమయంలో విద్యుత్ స్థంబాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సంసిద్ధత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.