డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి సెర్ప్ కార్యక్రమాలను సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, ఆగష్టు, 28 : జిల్లాలో డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం ద్వారా మహిళల సాధికారత కు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వార్షిక రుణ ప్రణాళిక మరియు డ్వాక్రా సంఘాల జీవనోపాదుల కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని , మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నదని , ముఖ్యంగా ఉద్యానవనాలు, మత్స్య శాఖల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలన్నారు. జిల్లాలోని 41 వేల 525 స్వయం సహాయక సంఘాలకు గాను 39 వేల 396 సంఘాలు 1688 కోట్ల రూపాయలతో సూక్ష్మ రుణ ప్రణాళికలు అందించారని, వారికి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, వారు దరఖాస్తు చేసిన స్వయం ఉపాధి యూనిట్లు వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యానవనాలు విభాగంలో ప్రకృతి వ్యవసాయంలో మహిళా రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి సాంకేతిక రంగాలలో శిక్షణ అందించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా అన్ని విధాలా సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలతో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటుచేసి, పాడి పశువుల కొనుగోలు, గొర్రెలు, మేకలు కొనుగోలుకు, ఆక్వా రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడేలా కృషి చేయాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరగాలని, రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో లబ్ధిదారులకు శిక్షణ అందించి డ్రోన్లు మంజూరు చేయాలన్నారు.
సమావేశంలో డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, వ్యవసాయాధికారి హబీబ్ భాష, జిల్లా ఉద్యానవన శాఖాధికారి రామ్మోహన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, పశుసంవర్ధక శాఖాధికారి డా. గోవిందరాజులు, నాబార్డ్ ఏ జీఎం అనిల్ కాంత్, ఎల్డిఎమ్ నీలాద్రి, ప్రభృతులు పాల్గొన్నారు.