Close

హేలాపురి ఉత్సవం… షాపింగ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 19/10/2025

ఏలూరు, అక్టోబర్, 19 : జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఆదివారం రాత్రి జరిగిన ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్..లో భాగంగా నిర్వహిస్తున్న ‘హేలాపురి ఉత్సవం… షాపింగ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు ఎంతో లబ్ది కలుగుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర వస్తువులతో పాటు, ఎలక్ట్రానిక్స్, చిన్న, పెద్దతరహా వాహనాల ధరలు పెద్దఎత్తున తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు నెలకు 5 వేల నుండి 10 వేల రూపాయల వరకు ప్రతీ కుటుంబానికి ఆదా అవుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రతీ కుటుంబానికి మరింత అవగాహన కలిగించేందుకు గత నెల రోజుల నుండి వివిధ అంశాలపై గ్రామ/వార్డ్ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో పండుగ వాతావరణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జీఎస్టీ ఫలాలు ప్రతీ కుటుంబానికి చేరాలన్న ఉద్దేశ్యంతో గత నెల రోజులుగా జిల్లాలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జీఎస్టీ స్లాబులు మార్పులపై ప్రజలలో అవగాహన పెరిగిందని, జీఎస్టీ పాత ధరలు వసూలు చేసేవారిని ప్రజలు ప్రశ్నించాలన్నారు. పాత జీఎస్టీ వసూలు చేసే వ్యాపారస్తులపై ఫిర్యాదు చేస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు సామాన్యులకు ఒక వరమని, ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చాయన్నారు.

ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా 8 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నప్పటికీ, పేదవారికి అన్ని వస్తువుల ధరలు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రేట్లను తగ్గించాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా హేలాపురి ఉత్సవం.. షాపింగ్ ఫెస్టివల్ లో 500 రూపాయలు, అంతకుమించి కొనుగోలు చేసిన వినియోగదారుల పేర్లను లక్కీ డ్రా తీసి ముగ్గురు విజేతలకు మొదటి బహుమతిగా బైక్, రెండవ బహుమతిగా ఎయిర్ కండీషనర్, మూడవ బహుమతిగా ఎల్ ఈ డి టివి లను కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హేలాపురి ఉత్సవం.. షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు సహకారం అందించిన దాతలు నవభారత్ లిమిటెడ్, గోద్రెజ్ అగ్రోవేట్ లిమిటెడ్, గోర్మెట్ పాప్ కార్నికా కంపెనీ, విన్నర్ సెరామిక్స్ లిమిటెడ్ యాజమాన్యాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు. హేలాపురి ఉత్సవం.. షాపింగ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాలను పెద్దఎత్తున బాణాసంచాలతో పండుగ వాతావరణంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ తో సెల్ఫీ దిగేందుకు విద్యార్థినులు పోటీ పడ్డారు.

కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎం. శ్రీహరి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.