Close

ఏలూరు, అక్టోబర్, 27 : తూఫాన్ సమయంలో ప్రజలెవ్వరూ కాజ్ వే లు, కల్వర్టులు దాటకుంటా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు తుఫాన్ పర్యవేక్షణ జోనల్ ప్రత్యేక అధికారి ఆర్. పి . సిసోడియా అధికారులను ఆదేశించారు.

Publish Date : 27/10/2025

ఏలూరు, అక్టోబర్, 27 : తూఫాన్ సమయంలో ప్రజలెవ్వరూ కాజ్ వే లు, కల్వర్టులు దాటకుంటా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు తుఫాన్ పర్యవేక్షణ జోనల్ ప్రత్యేక అధికారి ఆర్. పి . సిసోడియా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం జిల్లాలో తుఫాన్ ముందస్తు చర్యలపై ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి మరియు తుఫాన్ పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ లతో కలిసి ఆర్. పి . సిసోడియా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ తుఫాన్ తీవ్రతపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి నష్టం సంభవించకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. తుఫాన్ మంగళవారం తీరం దాటే అవకాశం ఉన్నందున ఆరోజు తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించకుండా అధికారులు ముందస్తుగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు తుఫాన్ ప్రమాదం తొలగిపోయే వరకు వారికి కేటాయించిన ప్రదేశాలనే నివాసం ఉండి, తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిలాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాలకు సంబందించిన ప్రజలకు 82 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని, కలిదిండి లో ఒక తుఫాన్ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో శిధిలావస్థలో ఉన్న భవనాలు, పూరిళ్లలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవ సమయానికి దగ్గరలో ఉన్న గర్భిణీలను దగ్గరలోని పిహెచ్సి లకు తరలించాలన్నారు. తూఫాన్ సమయంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదకరమైనవిగా గుర్తించిన కాజ్ వే లు, కల్వర్టులు ప్రజలెవ్వరూ దాటకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయడంతోపాటు పోలీస్, రెవిన్యూ సిబ్బందితో పికెట్లు ఏర్పాటుచేయాలన్నారు. కల్వర్టులు, కాజ్ వే ల వద్ద నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రదేశాలకు వెంటనే చేరుకొని తుఫాన్ సహాయక చర్యలు ప్రారంభించాలన్నారు. తుఫాన్ సహాయక సిబ్బంది వద్ద టార్చ్ లైట్లు, రైన్ కోట్, సెల్ ఫోన్ చార్జర్ లను తమ వెంట సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుఫాన్ కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, జెసిబి లు, చెట్లు కట్ చేసే యంత్రాలు, సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో బలహీనంగా ఉన్న చేతులు, హోర్డింగ్లు, స్తంభాలను గుర్తించి కూల్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తుఫాన్, తీవ్రగాలులు పై ప్రజలకు అవగాహన కల్పించి రానున్న మూడు రోజులపాటు ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తం చేయాలనీ, ప్రజలు మూడు రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలు, త్రాగునీరు వంటివి ఉంచుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా జిల్లాలోని 11 లంక గ్రామాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా గ్రామాలలో ఆహరం, వైద్య, త్రాగునీరుకి సమస్య లేకుండా చూడాలన్నారు. తుఫాన్ సహాయక కేంద్రాలలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు ఉండేలా చూడాలని, సహాయక కేంద్రానికి వచ్చే మార్గం సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. తుఫాన్ అనంతరం త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఐటిడిఏ పి ఓ రాములు నాయక్, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.