కలిదిండి మండలం లొల్వ డ్రైన్ పై కూలిపోయిన వంతెనను ఆదివారం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు.
కలిదిండి/ ఏలూరు, అక్టోబర్, 26 : కలిదిండి మండలం లొల్వ డ్రైన్ పై కూలిపోయిన వంతెనను ఆదివారం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయిన డ్రైన్ ను దాటే ప్రయత్నం చేయవద్దని, మొంథా తుఫాన్ కారణంగా కైకలూరు నియోజకవర్గంలో రాబోయే 3 రోజులపాటు తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారులతో సహకరించి ముంపు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలను రావాలన్నారు. తూఫాన్ తీరం దాటే సమయంలో మంగళవారం తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ఆ సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దన్నారు. చెరువుల వంటి ప్రదేశాల వద్దకు వెళ్లవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. తూఫాన్ ప్రమాదం తొలగిన వెంట దెబ్బతిన్న వంతెన స్థానంలో మూడు రోజులలో తాత్కాలిక వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ప్రజల అప్రమత్తతతో ఉండాలన్నారు. ముఖ్యంగా లంక గ్రామంలోని మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లవద్దని సూచించారు. తూఫాన్ సమయంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు పెదయడ్లగాడి వంతెన వద్ద వరద పరిస్థితిని కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.
కలెక్టర్ వెంట జయమంగళ వెంకటరమణ, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, తహసీల్దార్, ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.