22 ఏ భూముల అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలకు సంబంధిత విఆర్ఓ లను బాధ్యులు తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరు, అక్టోబర్, 25 : జిల్లాలో 22 ఏ భూములపై అందిన అభ్యంతరాలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం సాయంత్రం ప్రభుత్వ భూముల పరిరక్షణ, 22 ఏ భూములపై అందిన అభ్యంతరాల పరిష్కారం, తదితర అంశాలపై రెవిన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 22 ఏ భూములపై 201 అభ్యంతరాలు అందాయని, వాటిలో పెండింగ్ లో ఉన్న 125 దరఖాస్తులను నవంబర్ నెలాఖరులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను పరిశీలించి అందుకు తగిన కారణాలను తెలియజేస్తూ తిప్పి పంపాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉందన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే అడ్డుకోకుండా నిర్లిప్తత ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలకు సంబంధించి అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ లు అచ్యుత్ అంబరీష్, రమణ, సర్వే శాఖ ఏ డి అన్సారీ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.