“”మీ డబ్బు – మీ హక్కు”” నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రారంభించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి పోస్టల్ విడుదల చేశారు.
ఏలూరు, అక్టోబర్, 31 : “”మీ డబ్బు – మీ హక్కు”” నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రారంభించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి పోస్టల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేరు మీద ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరిచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకుంటున్నారని, అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆస్తులు లబ్ధిదారులకు చేరకపోవడానికి ఖాతాదారుల మరణం, చిరునామా మార్పు లేదా నామిని వివరాల లోపం వంటి కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రచారం ద్వారా పౌరులు తమ పేరు మీద ఉన్న క్లైమ్ చేయని నిధులను గుర్తించి సరైన పత్రాలతో సులభంగా క్లైమ్ చేసుకోవడానికి వీలు కల్పించబడుతుందని తెలిపారు. నవంబర్, 1వ తేదీ కలెక్టరేట్ లోని గోదావరి కాన్ఫరెన్స్ హాలు వద్ద ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు లీడ్ బ్యాంకు మేనేజర్ తో పాటు జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నీలాద్రి , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మరియు ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.