మధ్యాహ్న భోజనంపై అధికారులు, ఎంఈఓ లతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్
ఏలూరు, నవంబర్, 14 : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని ఏజెన్సీ లపై, సక్రమంగా పర్యవేక్షించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలలో బోజన పధకం అమలులపై సంబంధిత శాఖల అధికారులు, ఎంఈఓ లతో శుక్రవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యార్థులలో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పధకంను అమలు చేస్తున్నదని, అటువంటి పధకాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలలో నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనం అందించాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితులలోను రాజీ పడవద్దని, నాణ్యమైన బియ్యం, కూరగాయలు, ఆహార తయారీ పదార్థాలు నాణ్యతో ఉండేలా చూడాలని, భోజనం తప్పనిసరిగా పూర్తి శుచి , రుచిగా ఉండాలన్నారు. కొన్ని పాఠశాలల్లో భోజనం రుచిగా లేని కారణంగా కొంతమంది విద్యార్థులు భోజనం స్వీకరించడం లేదని, అందుకుగల కారణాలు, లోపాలను గుర్తించి నూరుశాతం మంది విద్యార్థులు భోజనం స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న బొజనంపై విద్యార్థులు, తల్లితండ్రుల సూచనలు, అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. నాణ్యమైన బియ్యం మాత్రమే వినియోగించాలని, భోజనం తయారీ పదార్థాలు పరిశీలించాలని, ఏజెన్సీ వారు రుచిగా వండేలా చూడాలని, లేనిపక్షంలో ఏజెన్సీ ని మార్చాలన్నారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని, మధ్యాహ్న భోజనం తయారీ కిచెన్, వంట పాత్రలు పరిశుభ్రంగా ఉండాలని, ఎంఈఓ లు తరచూ మధ్యాహ్న భోజన పధకాన్ని తనిఖీ చేసి, నాణ్యత సక్రమంగాలేని వాటిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సక్రమంగా పాఠశాలలపై పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించని ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు ఎంఈఓ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ కలెక్టర్ డీఈఓ ని ఆదేశించారు. ఇటీవల ఆహార కమిషన్ సభ్యులు తనిఖీలో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, మహిళలకు అందించే ఆహరం నాణ్యత లేకపోవడం, నూనె, గుడ్లు వంటి స్టాక్ సక్రమంగా లేనట్లుగా గుర్తించారని, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఇంత అద్వాన్న పరిస్థితులలో ఉండడంపై ఐసిడిఎస్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపి ఓ లు సరైన పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపి ఓ లు అంగన్వాడీ కేంద్రాల తనిఖీలు చేసిన వివరాలను తనకి సమర్పించాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి శారద, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మూర్తి, డిఎస్ ఓ విలియమ్స్, ఎంఈఓ లు, ప్రభృతులు పాల్గొన్నారు.