Close

పిజిఆర్ యస్ లో ఇచ్చిన అర్జీలకు చక్కని పరిష్కారం చూపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కి ఘన సన్మానం చేసి, అభినందించిన 74 ఏళ్ల వృద్ధులు చందు నాగేశ్వరరావు .

Publish Date : 22/12/2025

ఏలూరు, డిసెంబరు 22: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కారవేదిక కార్యక్రమానికి పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన చందు నాగేశ్వరరావు ( 74) వృద్ధులు వచ్చి పిజిఆర్ యస్ లో చక్కని పరిష్కారం చూపారని పది మందిని పూలమాలలతో ఘనంగా సత్కరించుకోవాలని జిల్లా కలెక్టరు కలెక్టరు కె.వెట్రిసెల్విని కోరగా ఆమె చిరునవ్వుతో అనుమతినిచ్చారు. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వితో పాటు, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, కెఆర్ సిసి డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవిలతో పాటు మరో అరుమంది జిల్లా అధికారులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ చందు నాగేశ్వరరావు సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఎంతో ఆనందంగా వచ్చి చెప్పటం చాలా అభినందనీయం, స్ఫూర్తిదాయకం అన్నారు. నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇది ఒక విజయగాథగా స్వీకరించి ఏలూరు జిల్లాలో అన్ని మండలాలు పిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలను ఇదే స్పూర్తితో పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులు సూచించారు.

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక అమ్మపాలెం గ్రామ నివాసియైన (లేటు) చందు శీతారామయ్య కుమారుడు చందు నాగేశ్వరరావు (74) అభ్యర్థించుకున్న విన్నపం: అమ్మా ! నేను గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసి ఉన్నాను. వాటి అన్నింటికీ మీ వల్ల పరిష్కారము జరిగాయి. సీరియల్ నెంబర్లు యిచ్చి రద్దీ లేకుండా టోకెను ప్రకారం పంపుచున్నారు. మరియు మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషము. ఎక్కడో కాశీలో అన్నపూర్ణమ్మ అన్నం పెడుతుంది అన్నారు కాని మేము చూడలేదు. జిల్లా కలెక్టరు అమ్మ అన్నం పెట్టడం చూశాము. కనుక ఉడతా భక్తిగా లేక కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మునికి అటుకులు ఇచ్చిన ప్రేమగా మీకు మరియు మీ ప్రక్కన వేదికపైన ఉన్న ఆఫీసర్లకు సుమారుగా 10 మందికి పూలదండలతో మాత్రమే సన్మానం చెయ్యాలని నా కోరిక.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు పరిపాలన అధికారి యన్.వి. నాంచారయ్య, సూపర్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.