జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి సౌరబ్ గౌర్
ఏలూరు, డిసెంబర్, 23 : పేదలకు అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని, విధుల పట్ల అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి సౌరబ్ గౌర్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని మంగళవారం రాత్రి సౌరబ్ గౌర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలలో రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి సౌరబ్ గౌర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సౌరబ్ గౌర్ పేదప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, అందుకు తగినవిధంగా వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతీ రోగి ఆసుపత్రిలో సేవలతో సంతృప్తిగా ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి తప్పనిసరిగా రావాలని అదే ప్రభుత్వ ఆశయమని, అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వ ప్రభావం ప్రభుత్వ ప్రతిష్టపై పడుతుందని ఇది సహించరాని నేరమన్నారు. ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రులలో సిసి కెమెరాలు ఉండాలని, రోగులకు సిబ్బంది అందించే సేవలపై వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై రోగులు ఫిర్యాదు చేస్తే వెనువెంటనే విచారణ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఎక్కడా అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా ఉండాలన్నారు. ప్రసూతి, చిన్నపిల్లల వార్డులు, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న భోజనం నాణ్యతను అడిగి తెలుగుకున్నారు. ప్రసూతి, లేబర్ వార్డులలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం టాయిలెట్లను పరిశీలించారు. టాయిలెట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం డ్రగ్ స్టోర్ ను పరిశీలించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి .జె. అమృతం, ఆసుపత్రిల సేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.