Close

ఎరువులు పంపిణీ, ఎరువులు, విత్తనాల నాణ్యతపై వ్యవసాయాధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 23/12/2025

ఏలూరు, డిసెంబర్, 23 : ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలు సరఫరా, పంపిణీ, నాణ్యత అంశాలపై వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయాధికారులు వారి పరిధిలో రైతులు, సాగు విస్తీర్ణం, పనులకు కావలసిన ఎరువులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాలోని రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న 10 రోజులకు అవసరమైన ఎరువులను నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎరువుల కొరత ఎదురైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. రైతులకు అందించే ఎరువులు, విత్తనాల నాణ్యతను వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల సిబ్బంది పరిశీలించాలని, కల్తీ విత్తనాలు, ఎరువులు ఎక్కడా పంపిణీ కాకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రానున్న 10 రోజులపాటు ఆకస్మిక తనిఖీలు చేయాలనీ, కల్తీ ఎరువులు, విత్తనాలు అమ్మే వర్తకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్, కోకో వంటి ఉద్యానవన పంటల సాగువిస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని లక్ష్యం కన్నా ఎక్కువగా పెంచామన్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తి సామర్ధ్యానికి తగిన విధంగా జిలాల్లో ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయా అని పరిశీలించాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, జిల్లా ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ అధికారి రామ్మోహన్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.