పోలవరం ఆర్ అండ్ ఆర్, జాతీయ రహదారులు భూసేకరణలపై అధికారులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్
ఏలూరు, డిసెంబర్, 27 : పోలవరం ఆర్ అండ్ ఆర్ భూసేకరణ కు భూమి గుర్తింపు పనులు నెలరోజుల్లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శనివారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, రైల్వే ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణం, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూ సేకరణ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, కాలనీల నిర్మాణాలు, ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా సేకరించవలసిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. భూసేకరణకు సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని, ఆమోదం అనంతరం భూసేకరణ ప్రకటనలను విడుదల చేయాలనీ, ప్రక్రియను నెల రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. మోదెల గ్రామంలో సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దొరమామిడి గ్రామంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులకు సంబంధించి ఎన్ .హెచ్. 165, గ్రీన్ ఫీల్డ్ హై వే , జీలుగుమిల్లి- పట్టిసీమ, ,పెడన-లక్ష్మీపురం 216-హెచ్ రహదారి, పట్టిసీమ-గూటాల రహదారుల భూసేకరణ పై, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏలూరు జిల్లాలో చేపట్టే భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్ట్ లలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో లు యం.అచ్యుత అంబరీష్, రమణ, కలెక్టరేట్ భూసేకరణ విభాగ అధికారి పోతురాజు, జిల్లా భూసేకరణ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ,తదితరులు పాల్గొన్నారు.