నూజివీడులోని జెడ్పి బాలికోన్నత పాఠశాల, డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు/నూజివీడు, ఫిబ్రవరి, 18 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడేలా ఉపాధ్యాయులు బోధన చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను, అన్నవరం రోడ్డులోని డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా జెడ్పి ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు వెళ్లి ఉపాధ్యాయుల బోధనా పటిమను పరిశీలించారు. తరగతి సిలబస్ కి సంబంధించిన ప్రశ్నలను విద్యార్థినులను అడిగారు. ఎటువంటి ఉన్నత విద్య అభ్యసిస్తారని అడిగి తెలుసుకున్నారు. ఉన్నతస్థాయి లక్ష్యాలు సాధించాలంటే ఇష్టంతో కస్టపడి చదవాలని హితబోధ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ పటిష్ఠతకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇటీవల డీఎస్సీ లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లో వెయ్యికి పైగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు 100 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని, 10 ఫలితాలలో నూరుశాతం ఫలితాల సాధన దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. తరగతి గదిలోని ఏ విద్యార్థి, ఏ సబ్జెక్టు లో వెనుకబడి ఉన్నాడో తెలుసుకుని, ఆ సబ్జెక్టు లో పరిణితి సాధించేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు అందించే మెనూలో నాణ్యత లోపిస్తే వంట ఏజెన్సీ పై చర్యలు: జిల్లా కలెక్టర్
అనంతరం అన్నవరం రోడ్డులోని డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు తప్పనిసరిగా పాటించాలని, విరుద్ధంగా నాణ్యత లేని భోజనాన్ని అందిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. విద్యాధికులు భోజన నాణ్యత మరియు గురుకులం లో సమస్యలను ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిప్యూటీ డిఈ ఓ సుధాకర్, ఎంఈఓ లు ప్రసాద్, జమలయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.