Close

ప్రయాణీకులకు సౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తనలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ సర్వే సేవాలోపాలు గుర్తిస్తే సంబంధిత సిబ్బంది, అధికారులపై చర్యలు

Publish Date : 18/02/2026

ఏలూరు/నూజివీడు, ఫిబ్రవరి, 18 : ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నూజివీడు ఆర్టీసీ బస్టాండ్ ను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. బస్టాండ్ లో సౌకర్యాలు, ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనలను ప్రయణీకులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణీకుల భద్రత, సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. ప్రభుత్వ ఆలోచనలకూ అనుగుణంగా ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. ప్రయాణీకుల భద్రతకు సిసి కెమెరాలు ఏర్పాటుచేసి, వాటిని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేస్తామని, దీనికరణంగా రాత్రి సమయాలలో బస్టాండ్ పరిసరాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారించవచ్చన్నారు. ఏలూరులో ఇటీవల జరిగిన డిఆర్సి సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారు నూజివీడు బస్టాండ్ లో ప్రయణీకుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న సూచనల మేరకు నూజివీడు బస్టాండ్ లో సౌకర్యాలను పరిశీలించేందుకు వచ్చామన్నారు. నూజివీడు బస్టాండ్ లో ఆర్ఓ మంచినీరు, అదనపు టాయిలెట్లు, బెంచీలు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, గృహ హింస కు సంబంధించి ఫిర్యాదు చేయవలసిన నంబర్లను బస్టాండ్ లో ప్రముఖంగా తెలిసేలా ప్రదర్శించాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బస్టాండ్ లో తినుబండారాల షాపులలో నాణ్యతను మరియు వ్యాపారాలు అధిక ధరలకు అమ్మకుండా అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, ప్రయణీకులతో డ్రైవర్, కండక్టర్, తదితర సిబ్బంది ప్రవర్తన, తదితర విషయాలపై ప్రజలు అభిప్రాయాలు, ప్రజల సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల నుండి తెలుసుకుంటున్నదన్నారు. ప్రయణీకుల సౌకర్యాలతో లోపాలు, ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనలో లోపాలను ప్రజలు తెలియజేస్తే, సదరు సిబ్బంది, బస్టాండ్ లో ప్రయాణీకుల సౌకర్యాల నిర్వహణను పరిశీలించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విషయాన్నీ గమనించి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సక్రమంగా తమ విధులు నిర్వర్తించాలన్నారు.

ఈ సందర్భంగా బస్టాండ్ షాపులలో విక్రయిస్తున్న వస్తువుల నాణ్యతను పరిశీలించారు. ప్రయాణీకులు అందరినీ బస్టాండ్ లో సౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తనను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినుత, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్, డిపో మేనేజర్ దనాంజనేయులు, తహసీల్దార్ బద్రు, ఎండిఓ రాజేంద్రనాథ్, డిఎస్పీ ప్రసాద్, ప్రభృతులు పాల్గొన్నారు.