బలివే మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, పాలకవర్గ సభ్యులు, నాయకులతో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రుసెల్వి సంయుక్తంగా సమీక్షించి, దిశానిర్దేశం చేశారు ..
ఏలూరు/ముసునూరు, ఫిబ్రవరి 13: ముసునూరు మండలం బలివేశ్రీ రామలింగేశ్వర స్వామి ( బలే రామస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లు అధికారులను, పాలకవర్గ సభ్యులకు ఆదేశించారు. మహా శివరాత్రి ఉత్సవాలు నిర్వహణపై ఇప్పటివరకు శాఖలు వారీగా కేటాయించిన పనులుపై శాఖలు వారీగా సమీక్షించి, పలు సూచనలు జారీచేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ బలివే మహాశివరాత్రి ఈనెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులకు మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. అధికార్లు, పాలకవర్గ సభ్యులు, నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళేలా పక్కగా ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చిన్న పొరపాటుకు తావులేకుండా మహాశివరాత్రి ఉత్సవాలు అధికార్లు సమిష్టిగా పనిచేసి విజయవంతం చెయ్యాలని అన్నారు.మహా శివరాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ పరిసరాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సదుపాయాలు, విద్యుత్తు సరఫరా, వైద్య సేవలు వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులు, దివ్యాంగులకు వెనువెంటనే దర్శనాలు చేయించి, తిరిగి ఇంటికి క్షేమంగా పంపించాలని అన్నారు. అక్రమ మద్యం, మత్తు పదార్థాలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆకతాయిలు, జేబుదొంగలుపై డేగకన్ను వెయ్యాలని తెలిపారు. ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. తమ్మిలేరు కాలవలు పుణ్య స్థానాలు ఆచరించే టప్పుడు, లోతుగా ఉన్న ప్రదేశాలు, సుడిగుండాలు అవకాశం ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు, గజతగాళ్ళు, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు. మహా శివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు అందరూ అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పట్టిసీమ, బలివే రెండు చోట్ల మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటారని, ఇప్పటికే రెండు సార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఆలయం వద్ద, ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలుగకుండా, తొక్కిసలాట జరుగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు రద్దీకి తగ్గట్టుగా సిసి కెమెరాలు, డ్రోన్ల ద్వారా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాలు సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులను ప్రాధాన్యతతో నిర్వహించాలని, అలాగే త్రాగునీరు, ప్రథమ చికిత్స శిబిరాలు, ముఖ్యంగా గోదావరి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు, రాత్రి పూట ఆలయ ప్రాంగణాల్లో విద్యుత్ దీపాలు, భక్తులకు వివిధ సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు, సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు వివిధ జిల్లాలు నుండి పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా, భక్తులు సంఖ్యకు అనుగుణంగా వివిధ డిపోలు ద్వారా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. జెట్టీలు, బోట్లు, జెయింట్ వీల్, తదితర వాటికి ఆయా శాఖ అధికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేయాలన్నారు.
అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఏర్పాట్లను, పుణ్యస్థానాలు చేసే ఘాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, డిఎస్పీ కె.వి.వి. యన్.వి.ప్రసాదు, ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు బొమ్మకంటి శ్యామల రావు, కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య, వివిధ శాఖలు అధికారులు, పాలకవర్గం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.