జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి సమీక్షించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
ఏలూరు, ఫిబ్రవరి 27: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరం నందు శుక్రవారం “జిల్లా రహదారి భద్రత కమిటీ సమీక్ష సమావేశం, శిక్షణతో భద్రత -సాంకేతికత ద్వారా ప్రవర్తన” జిల్లా రవాణా శాఖ ఆధర్యంలో జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు.
రవాణా, పోలీసు, ఆర్& బి, వైద్యశాఖ, ఎన్.హెచ్, సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలుపై జిల్లా కలెక్టరు సమీక్షించారు.
ముందుగా జిల్లా రవాణా అధికారి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలు నివేదికను జిల్లా కలెక్టరుకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాలు గణాంకాలను నెలవారి సమీక్షించి, ప్రమాదాలకు గల కారణాలపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. ద్విచక్ర వాహన ప్రమాదాలు నివారణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ముఖ్యంగా అధిక వేగం, మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం వంటి అంశాలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైనచోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై చైతన్యం, అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా కళాశాలలు విద్యార్థులకు రోడ్డు భద్రత నియమనిబంధనలపై అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని అన్నారు. వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం, సెల్ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగు, రాంగు రూటు డ్రైవింగు, రోడ్ల మలుపు ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టు కుంటున్నారని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనం యజమానులపై కేసు నమోదు చేసి, జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చెయ్యాలని అన్నారు. వాహనదారులు ఇష్టానుసారం రోడ్ల పక్కన వాహనాలు పార్కింగు చేయకుండా మార్కింగు చేసి ఆ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగు చేసుకునే విధంగా ఏర్పాటు చెయ్యాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల్లో ఆక్రమణలను తొలగించి పార్కింగు ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై విచ్చలవిడిగా పశువులు సంచరించడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నాయని పశువులు యజమానులతో మాట్లాడి రోడ్లపై వదలకుండా చూడాలన్నారు.
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జాతీయరహదారిలో లైట్లు వెలుగుట లేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పరిశీలన చేసి పూర్తిస్థాయిలో లైటింగు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులో విద్యార్థులు డోర్లో వ్రేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అటువంటి రూట్లు ముందుగా తెలియజేసినట్లయితే పోలీసు ప్రొటెక్షన్ ఇస్తామని తెలిపారు. క్రమశిక్షణతో యువత రోడ్డు భద్రతా చర్యలను పాటించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణకు బాధ్యతగా మెలగాలని తెలిపారు. రోడ్డు మార్జిన్లు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న షాపు వాళ్ళకు అవగాహన కల్పించి, వేరేచోట పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు.జిల్లాలో ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు వినూత్నమైన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు, జిల్లా రవాణా శాఖ ఇంచార్చి ఉప కమీషనరు కె.యస్.యం.వి. కృష్ణారావు, ఆర్టీవో యస్.బి.శేఖరు, జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నo, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకట లక్ష్మమమ్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ఎస్ డా.బి.పాల్ సతీష్ కుమార్, సంబంధిత శాఖలు అధికారులు, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.