పట్టణంలో పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ లు ఆకస్మిక తనిఖీలు చేశారు …
ఏలూరు, ఏప్రియల్ 27: పట్టణంలో సోమవారం రాత్రి తూర్పువీధి గంగానమ్మగుడి దగ్గర యస్ వి ఫిల్లింగు స్టేషనను, వసంత మహల్ రిలయన్స్ జియో పెట్రోలు బంకు, జ్యూట్ మిల్ సెంటరు చలమయ్య పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకులోని రికార్డులను పరిశీలించిన అనంతరం, కంప్యూటరు డేటాను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు
కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వినియోగదారులు ఆందోళన చెందవద్దని, అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చెయ్యాలని సూచించారు. జిల్లాలో సరిపడినంత డీజిల్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. అవసరానికి మించి కొనుగోలు చెయ్యుట వలన కొరత ఏర్పడుతుందని, ఇంటి దగ్గర అవసరానికి మించి నిల్వ పెట్టుకుంటే వేసవిదృష్ట్యా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. హార్వెస్ట్ యంత్రాలకు ఎటువంటి ఇంధన లోటు రాకుండా ఆయిల్ కూపన్లు జారీ చేస్తున్నామని, వ్యవసాయ మరియు ఆక్వా రంగాలకు చెందిన రైతులకు సాగులో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు లేదా వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కాల్ సెంటరును సంప్రదించాలని, ఫిర్యాదులను నమోదు చేసి సంబంధిత అధికారులు ద్వారా తక్షణ పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంధన పంపిణీ వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రతి పెట్రోల్ బంకు వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని టాస్క్ఫోర్స్ విధానంలో నియమించి, అన్ని శాఖలు సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు. త్వరలోనే సమస్య పూర్తిగా పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొనేలా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ సందర్భంలో తహశీల్దారు కె.గాయత్రీదేవి, ఫిల్లింగు స్టేషన్ యజమాని, రెవెన్యూ మరియు పోలీసు శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.