Close

బంకు యజమానులు ఇండెంట్ పెట్టిన వెంటనే ట్యాంకర్ అందించేలా ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకోవాలి ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 27/04/2026

ఏలూరు, ఏప్రిల్, 27 : జిల్లాలోని ఏ బంకు లోనూ పెట్రోల్, డీజిల్ ఆయిల్ కొరత పరిస్థితి తలెత్తకుండా ట్యాంకర్లు బంకు లకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి డీజిల్ కొరత అంశంపై జిల్లాలో పలు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సోమవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఏ బంకు లోనూ పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోకుండా చూడాలని, ఆయిల్ నిల్వలను ముందుగానే గుర్తించి వెంటనే ట్యాంకర్లు ఇండెంట్ చేసి ట్యాంకర్లు బంకు లకు చేరుకునేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. డీజిల్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనలతో ప్రజలు ఎక్కువ మొత్తం పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు. అందుకోసం ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయవలసిన బాధ్యత ఆయిల్ కంపెనీలపై ఉందన్నారు. ట్యాంకర్ల కోసం బంకు యజమానులు ఇండెంట్ పెట్టిన వెంటనే ట్యాంకర్లు బంకు కు వచ్చేలా ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పెట్రోల్ , డీజిల్ డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా జరిగేలా ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, ట్రైనీ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల అధికారులు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, నయారా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.