Close

డీజిల్ కొరతపై అత్యవసరంగా జిల్లా కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యేలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

Publish Date : 26/04/2026

ఏలూరు, ఏప్రిల్, 26 : ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత అంశంపై జిల్లా కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ జిల్లాలో డీజిల్ కొరత ఉందని మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ప్రజలకు అందుబాటులో ఉంచి ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బంకులలో సరిపడా డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలకు తెలియజేసి, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా చూడాలన్నారు. ప్రస్తుత రబీలో ధాన్యం రవాణాకు వినియోగించే వాహనాలకు ఎటువంటి డీజిల్ కొరత లేకుండా చూడాలని, అదేవిధంగా ఆక్వా రైతులకు అవసరాలకు సరిపడా డీజిల్ సరఫరా కు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయము చేసుకుని జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఏ బంక్ లోనూ పూర్తి నిల్వలు అయిపోకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీలలో మాట్లాడి, జిల్లా అవసరాల మేరకు ఆయిల్ సరఫరాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి నుండి కూడా ఆయిల్ నిల్వలు పక్కదారి పట్టకుండా నిఘా పెట్టాలన్నారు. డీజిల్ కొరత ఏర్పాటుడుతుందనే ప్రజలు పెద్దమొత్తంలో డీజిల్ కొనుగోలు చేయకుండా వారికి అవగాహన కలిగించాలన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయాలనీ, . అవసరానికి తగిన విధంగా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇదే సమయంలో, డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పార్థసారధి అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అవసరాల మేరకు డీజిల్ ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో డీజిల్ కు ఎటువంటి కొరతా లేదన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు లోనవుతూ పెట్రోల్ బంకుల వద్ద అధిక సంఖ్యలో చేరుతున్నారని పేర్కొన్నారు. అవసరం లేకపోయినా డీజిల్‌ను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని చెప్పారు. అయినప్పటికీ డిమాండ్ మేర సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో సగటున రోజుకు 365 కిలో లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతున్నదని, డీజిల్ కొరత వస్తుందన్న వదంతులతో గత వారం రోజులుగా 10 నుండి 20 శాతం అధికంగా కొనుగోళ్లు పెరిగాయని, అందుకు అనుగుణంగా సరఫరా ను కూడా పెంచామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు జిల్లాలో ఎటువంటి కొరత లేదని మంత్రికి స్పష్టం చేశారు.

ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి ), చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ లు మాట్లాడుతూ డీజిల్ నిల్వలు ఐపోతున్న బంకులు వివరాలు ముందుగానే తెలుసుకుని వాటికి డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ లు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ప్రస్తుత రబీలో ధాన్యం రవాణాకు వినియోగించే వాహనాలకు ఎటువంటి డీజిల్ కొరత లేకుండా చూడాలని, అదేవిధంగా ఆక్వా రైతులకు అవసరాలకు సరిపడా డీజిల్ సరఫరా కు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి జగదీష్ , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధి మహేష్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధి సూర్య లు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో గత వారంరోజులుగా సాధారణం కన్నా 10 నుండి 20 శాతం మేర అధికంగా డీజిల్ సరఫరాను చేస్తున్నామన్నారు. డిమాండ్ ను అనుసరించి పెట్రోల్, డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు.