Close

కైకలూరు నియోజకవర్గం స్థాయిలో వివిధ శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు ..

Publish Date : 25/04/2026

ఏలూరు/ కైకలూరు, ఏప్రియల్ 25: కైకలూరు తహశీల్దారు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖ, ఎలక్ట్రిసిటీ, మత్స్యశాఖ, తదితర శాఖలు వారీగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించగలమన్నారు. జిల్లాలో సోలార్ లో మొదటిస్థానంలో ఉన్నామని, ప్రతి ఇంటికి, రైతులకు, పరిశ్రమలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా కృషి చెయ్యాలని అన్నారు. జలధార – జలహారతి కార్యక్రమాలు వేగవంతం చెయ్యాలని, భూగర్భ జలాలు మట్టములను పెంచే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. జాతీయ ఉపాధి శ్రామికులకు పని దినాలు కల్పించి వారికి నిర్ణీత సమయంలో డబ్బులు జమ చెయ్యాలని అన్నారు. డోరు టు డోరు చెత్త కలెక్షన్లు చెయ్యాలని ఇందుకు అవసరమైన వాహనాలు కొనుగోలు చెయ్యాలని, సంపద సృష్టించే కేంద్రాలు నిర్వహణ సక్రమంగా చెయ్యాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న వారిని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో జాయిన్ చేయించాలని, 5వ తరగతి పూర్తి చేసిన వారిని ఉన్నత పాఠశాల 6వ తరగతిలో జాయిన్ చేయించాలని అన్నారు. ఎక్కడ కూడా చదువు మధ్యలో మానివేసిన ఒక్కకేసు కూడా నమోదు కాకూడదని స్పష్టం చేశారు. బాల్యవివాహాలు జరగకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. మండలాలు వారీగా మంజూరైన పనులు, ప్రగతిలో ఉన్న వాటి వివరాలు, ఇంకా జరగవలసి ఉన్న పనులను వేగవంతం చెయ్యాలని అన్నారు. నియోజకవర్గం లో ఎక్కడ త్రాగునీటి కొరత లేకుండా పక్కా ప్రణాళికతో త్రాగు నీటిని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ పంచాయితీ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తూ గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహనిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. పరిశ్రమలు శాఖ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మహిళలను ప్రోత్సహించాలని, బ్యాంకు రుణాలు, రాయితీలుపై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. త్రాగునీటి వనరులు ఎక్కడ కలుషితం కాకుండా, లీకేజీలను అరికట్టి క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే విడుదల చేసి ప్రజలకు అందించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ఈప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టరు తనకు 12 ఏళ్లు గా తెలుసునని పోషణ అభియాన్ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తే జిల్లా అధికారులతో నియోజకవర్గ సమీక్ష కూడా నిర్వహిస్తానని చెప్పారని తనకు ఎంతో సంతోషం కలిగిందని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 3,600 ఎకరాల భూములకు ఉన్న భూసమస్యలను తొలగించాలని కోరారు. కైకలూరు నియోజకవర్గంలో విద్యుత్తు శాఖ పనితీరు బాగుందని అదేవిధంగా అన్ని చెరువులు నీటితో నిండి కళకళలాడుతున్నాయని జిల్లా యంత్రాంగం చక్కటి పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించినప్పుడే మన మనస్సుకు ప్రశాంతత, సంతృప్తి కలుగుతుందన్నారు. కైకలూరులో మంచినీటి సమస్య పరిష్కారం కొరకు రాపిడ్ సాండ్ ఫిల్టర్ ను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. కలిదిండి మండలం కొచ్చర్ల గ్రామానికి వెళ్లే వంతెన15 సంవత్సరాలు క్రితం నిర్మాణమైన ఇరువైపులా రహదారి నిర్మాణం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోరు, జిల్లా ఆర్& బి శాఖ యస్ఇ కె.విజయరత్నం, ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి.త్రినాధ బాబు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి డిడి బి.రాజ్ కుమార్, ఐసిడియస్ పిడి పి.శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్.సూర్యచక్రవేణి, సంబంధిత వివిధ శాఖలు జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.