Close

జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి సమీక్షించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..

Publish Date : 22/04/2026

ఏలూరు, ఏప్రిల్ 22: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరం నందు బుధవారం “జిల్లా రహదారి భద్రత కమిటీ సమీక్ష సమావేశం, శిక్షణతో భద్రత -సాంకేతికత ద్వారా ప్రవర్తన” జిల్లా రవాణా శాఖ ఆధర్యంలో జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు.

రవాణా, పోలీసు, ఆర్& బి, వైద్యశాఖ, ఎన్.హెచ్, సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలుపై జిల్లా కలెక్టరు సమీక్షించారు.

ముందుగా జిల్లా రవాణా అధికారి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుపై తీసుకున్న చర్యలు నివేదికను జిల్లా కలెక్టరుకు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాలు గణాంకాలను నెలవారి సమీక్షించి, గత నెలలో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్షించామని అన్నారు.నేషనల్ హైవే పై ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైనచోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ మరింత  కఠినతరం చెయ్యాలని  ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై చైతన్యం, అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహన ప్రమాదాలు నివారణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ముఖ్యంగా అధిక వేగం, మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం వంటి అంశాలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కళాశాలలు విద్యార్థులకు రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని అన్నారు. వాహనదారులు ఇష్టానుసారం రోడ్ల పక్కన వాహనాలు పార్కింగు చేయకుండా మార్కింగు చేసి ఆ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగు చేసుకునే విధంగా ఏర్పాటు చెయ్యాలని అధికారులు ఆదేశించారు.

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జాతీయరహదారిలో విద్యుత్తు లైటింగు ఉండేలా చూడాలని ఆదేశించారు. క్రమశిక్షణతో యువత రోడ్డు భద్రతా చర్యలను పాటించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణకు బాధ్యతగా మెలగాలని తెలిపారు. జిల్లాలో ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు వినూత్నమైన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం, సెల్ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగు, రాంగు రూటు డ్రైవింగు, రోడ్ల మలుపు ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టు కుంటున్నారన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

పీఎం రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి రు. 1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.

పీఎం రాహత్ పథకం క్రింద రహదారి ప్రమాద బాధితులకు సకాలంలో ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్లో ఉచితంగా రు. 1.5 లక్షల వరకు వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు.ఈ పథకం అమలులో భాగంగా ఏలూరు జిల్లాలలో 27 హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. రహదారి ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అర్హులేనని అన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ , రోడ్ ట్రాన్స్పోర్ట్ , పోలీసు డిపార్ట్మెంట్ అనుసంధానంతో పీఎం రాహత్ పధకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోనే హాస్పిటల్స్ కి ప్రభుత్వం ద్వారా డబ్బు చెల్లింపు చెల్లించ బడుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, ఉప రవాణా కమీషనరు షేక్ కరీం, ఆర్&బి శాఖ యస్ఇ కె.విజయరత్నం, డిసిహెచ్ డా.బి.పాల్ సతీష్ కుమార్, మున్సిపాలిటీ కమీషనరు ఏ.భాను ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, పంచాయతీ రాజ్ యస్ఇ జెడ్.రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.