Close

ఈనెల 18 నుంచి 25 వరకు జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష

Publish Date : 18/05/2026

ఏలూరు,మే,18: జిల్లాలో ఈనెల 18 నుంచి 25 వరకు జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించి సూచనలు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిపాలన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు అమలు, పర్యవేక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా 18.05.2026 నుండి 25.05.2026 వరకు జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా అవగాహన శిబిరాలు, గ్రామ సమావేశాలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పరస్పర చర్చా కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ శాఖలు మరియు ప్రజల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలన్నారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు. జన్ భాగీదారి అభియాన్ కింద ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు హక్కులపై విస్త్రృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమాజ బాధ్యత, సామూహిక చర్యను ప్రోత్సహించాలన్నారు. పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. సామాజిక సంక్షేమం, ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు జీవనోపాధి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి అవసరమైన ప్రభుత్వ సేవలు , సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రజలు సమగ్ర లబ్ధి సంతృప్తి (Universal Benefit Saturation) సంతృప్తి పొందేలా గ్రామస్ధాయి శిబిరాల ద్వారా ఆధార్ కార్డులు , ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు , జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తక్షణమే జారీ చేయడం లేదా నవీకరించడం చేయాలన్నారు. సామాజిక మరియు ఆర్థిక భద్రతకల్పించేందుకు పీఎం-కిసాన్ యోజన ,సామాజిక భద్రత పెన్షన్ పథకాలు ,బీమా పథకాలు ,నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ వంటి కార్యక్రమాలు నమోదు చేయాలన్నారు. సమగ్ర గిరిజన సాధికారత కింద పీఎం-జన్మన్ (PM-JANMAN) , ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ వంటి ముఖ్య పథకాల చివరి దశ అమలుకు ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలవాలన్నారు. అదే విధంగా గిరిజన సాంస్కృతిక సమగ్రతను పెంపొందించేందుకు సాంప్రదాయ గిరిజన కళారూపాలు , స్థానిక గిరిజన భాషలు పరిరక్షణ ప్రోత్సహించాలన్నారు. గిరిజన నాయకులు, ముఖ్యంగా భగవాన్ బిర్సా ముండా (“ధర్తి ఆబా”) గారిని స్మరించుకోవడం చేయాలన్నారు.

జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, ప్రభృతులు పాల్గొన్నారు.