తాళం వేసిన ఇళ్ల యజమానులు ఫోన్ నెంబర్లు పక్కవారిని అడిగి ఫోన్ ద్వారా వారి వివరాలు నమోదు చేయాలి జనగణన పురోగతిపై అధికారులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ టెలి కాన్ఫరెన్స్
ఏలూరు, మే , 19 : జిల్లాలో జనగణన కార్యక్రమం 20వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జనగణన పురోగతిపై మంగళవారం సాయంత్రం అధికారులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్లగణనను ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని, ప్రగతి చూపించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు 70 శాతం కన్నా తక్కువగా గణన చేసిన అధికారులు అందుకుగల కారణాలను తెలియజేసి, బుధవారం లోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్లు ఇండ్లగణన సమయంలో చాలా ఇళ్ళు తాళం వేసి ఉంటున్నాయని సమస్యను తెలియజేయగా వాటిపై జేసీ స్పందిస్తూ తాళం వేసిన ఇళ్ల యజమానులు ఫోన్ నెంబర్లు పక్కవారిని అడిగి ఫోన్ ద్వారా వారి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎట్టిపరిస్థితులలోనూ జనగణన ప్రక్రియను వెంటనే పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, డిపిఓ అనురాధ, ఆర్డీఓ లు కిషోర్, రమణ, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు పాల్గొన్నారు.