Close

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి MSME పార్కులు వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు తిలకించారు

Publish Date : 25/05/2026

ఏలూరు/మండవల్లి, మే 25: కైకలూరు నియోజకవర్గo మండవల్లి మండలం చాకలిపాడు గ్రామంలో సోమవారం 2.80 ఎకరాలు విస్తీర్ణంలో రూ 14.80 కోట్లతో ఏర్పాటుచేయనున్న MSME పార్కు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ తో కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శంఖుస్థాపన చేశారు. .

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి MSME పార్కులు వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 MSME పారిశ్రామిక పార్కులను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగా ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో 39 MSME పార్కులు వర్చువల్ గా శంకుస్థాపన చేశారని అన్నారు. ఇందులో భాగంగా మన జిల్లాలో రెండు చోట్ల MSME పార్కులు శంకు స్థాపనలు చేసుకోవడం శుభపరిణామం అన్నారు. కైకలూరు నియోజక వర్గo మండవల్లి మండలం చావలిపాడు, పోలవరం నియోజకవర్గo టి.నరసాపురం మండలం బండివారిగూడెం మొత్తం మన జిల్లాలో ఈ రోజు రెండు శంఖుస్థాపనలు చేసుకున్నామని అన్నారు. జిల్లాలో భూములు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నాయని అన్నారు. అయినా కూడా ప్రత్యేక దృష్టి పెట్టీ మిగతా 4 నియోజకవర్గాల్లో కూడా MSME పార్కులు శంకుస్థాపనలు చెయ్యుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గ్రామీణ మరియు క్షేత్రస్థాయిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, స్థానిక ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అందించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. చిన్న తరహా పారిశ్రామిక వేత్తలకు ప్రారంభ పెట్టుబడి ఖర్చులు మరియు నిర్వహణ వ్యయాలు భారీగా తగ్గుతాయని అన్నారు. జిల్లాలో కోకో సిటీ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని, జిల్లాలో యువత పరిశ్రమలు,ఉద్యోగ, ఉపాధి, స్కిల్ డెవలప్మెంటు ఏది కావాలన్నా చేసుకునే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని యువత ముందుకు రావాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ తో పాటు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, అభివృద్ధి ఉంటేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో తొలివిడతలోనే MSME పార్కు శంకుస్థాపనలు చేసుకునుట పరిశ్రమలు స్థాపనకు యువతకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మంచి మనస్సుతో పట్టం కట్టారని మీకు, పిల్లలకు మంచి చేయడానికే కూటమి ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. ప్రజలు జీవన విధానంలో , పిల్లలు చదువుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తోడుగా ఉంటామని. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అంతా మంచి చేయడానికే నిరంతరం పాటుపడతామని అన్నారు. ఏడు నెలల్లో MSME పూర్తి అయ్యి ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతాయని అన్నారు. తొలి విడతలో 200 పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇంకా స్థలం కావాలన్నా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోరు, డిప్యూటీ జోనల్ మేనేజరు అబ్దుల్ రహీమ్, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి యన్ జితేంద్రబాబు, ఏయంసి ఛైర్మన్ పెనుమత్స త్రినాధరాజు, వివిధ శాఖలు అధికారులు, ఏపి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టరు అండ్రాజు శ్రీనివాసరావు, ఏపి సగర కార్పొరేషన్ డైరెక్టరు గజ్జెల గణేష్, పారిశ్రామిక వేత్తలు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.