Close

కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూమిదారుల సమస్యల పరిష్కారానికి పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Publish Date : 02/06/2026

ఏలూరు, జూన్, 2 : కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూమిదారుల సమస్యల పరిష్కారానికి పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో చీఫ్ కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు, జ్యోతి లతో కలిసి మంగళవారం సాయంత్రం కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జిరాయితీ, డి.ఫారం భూమిదారుల సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫారసుల అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు ముఖ్యమైనదన్నారు. 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూములు సుమారు 20 వేల ఎకరాల వరకు ఉంటాయని, వారి సమస్యల పరిష్కారానికి, వారికి కల్పించవలసిన పునరావాస కార్యక్రమాలపై సుప్రీం కోర్ట్ సాధికార కమిటీ కి నివేదిక సమర్పించవలసి ఉన్నందున జిరాయితీ, డి.ఫారం భూముల విస్తీర్ణం, భూమిదారుల వివరాలు, తదితర సమాచారంతో సవివరమైన కార్యాచరణ ప్రణాలికను రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డిఎఫ్ఓ త్రిమూర్తులు రెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, పంచాయతీ రాజ్ ఎస్ఈ జెడ్. రమేష్, మత్స్య శాఖాధికారి రాజ్ కుమార్, ట్రాన్స్కో ఎస్ఈ కె. ఎం. అంబేద్కర్ , ప్రభృతులు పాల్గొన్నారు.