Close

మహిళల భద్రతకు మరింత బలోపేతం – వన్ స్టాప్ సెంటర్‌కు ప్రత్యేక వాహనం

Publish Date : 10/06/2026

ఏలూరు, జూన్, 10 : ఏలూరు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై హింసకు గురైన బాధితులకు తక్షణ, సమగ్ర సహాయం అందించేందుకు వన్ స్టాప్ సెంటర్ (OSC) కు ప్రత్యేక వాహనాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం కలెక్టరేట్ లో ప్రారంభించినారు
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మిషన్ శక్తి – సంబల్ (Mission Shakti – Sambal) పథకం మార్గదర్శకాల మేరకు ఈ వాహనం ఏర్పాటు చేయబడిందని, మహిళల భద్రత, రక్షణ మరియు పునరావాస సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ వాహనం కీలక పాత్ర పోషించనుందని కలెక్టర్ చెప్పారు. ఈ ప్రత్యేక వాహనం ద్వారా హింసకు గురైన మహిళలను సురక్షితంగా గుర్తించి వన్ స్టాప్ సెంటర్‌కు తరలించడం, అవసరమైన వైద్య సేవల కోసం ఆసుపత్రులకు తీసుకువెళ్లడం, పోలీస్ స్టేషన్లు, కోర్టులు మరియు ఇతర ప్రభుత్వ శాఖలకు న్యాయ సహాయం కోసం తరలించడం కోసం వినియోగించడం జరుగుతుందన్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వాహనంపై One Stop Centre (OSC), Women Helpline – 181, Child Helpline – 1098 మరియు Beti Bachao Beti Padhao లోగోలు మరియు సమాచారాన్ని ప్రదర్శించారని, దీని ద్వారా మహిళలు మరియు పిల్లలకు అందుబాటులో ఉన్న రక్షణ, సహాయ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందన్నారు. మహిళలు, బాలికలు ఏ విధమైన హింసకు గురైనప్పటికీ భయపడకుండా ముందుకు వచ్చి వన్ స్టాప్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో విమెన్ హెల్ప్‌లైన్ 181 ను సంప్రదించాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.
కార్యక్రమంలో ఐ.సి.డి.యస్. పి.డి. పి.శారద, నోడల్ అధికారి మరియు డి.యం.సి ఇ.తులసి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సి.హెచ్. నిర్మల, డి.సి.పి.ఓ., సి.హెచ్. సూర్య చక్రవేణి, సీనియర్ అసిస్టెంట్ జెస్సీ డైమండ్ రోజ్ మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.