గత ఏడాది జి ఎస్ టి అమలులో ఏలూరు జిల్లా 95 శాతం లక్ష్యాలు సాధించి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవడం అభినందనీయం.
ఏలూరు, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధిలో వస్తు సేవల పన్ను (GST) కీలక పాత్ర పోషిస్తుందని, జీఎస్టీ ఎగవేతలను అరికట్టి ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వాణిజ్య పన్నుల శాఖ (Commercial Taxes Department) మరియు వివిధ లైన్ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమన్వయ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రభుత్వ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు, మైనింగ్ కార్యకలాపాలు, పంచాయతీలు, సివిల్ సప్లైస్, సంక్షేమ శాఖలు, ఇంజినీరింగ్ శాఖలు తదితర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖకు సకాలంలో అందజేయాలని సూచించారు. సంబంధిత శాఖల వద్ద ఉన్న కాంట్రాక్టు పనులు, చెల్లింపులు, టిడిఎస్ మినహాయింపులు, మైనింగ్ లైసెన్సులు, ఇసుక రీచ్‌లు, కస్టమ్ మిల్లింగ్ తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం ద్వారా పన్ను ఎగవేతలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు.
ఆర్ & ఆర్ పనులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ శాఖలు, జడ్పీ, ఎంపీడీవోలు, ప్రణాళికా శాఖ, మైనింగ్, సివిల్ సప్లైస్ తదితర శాఖలు పెండింగ్‌లో ఉన్న సమాచారాన్ని వచ్చే వారం నాటికి అందించాలని ఆదేశించారు. వివిధ శాఖల్లో వినియోగిస్తున్న అద్దె వాహనాలకు సంబంధించిన టి డిఎస్ వివరాలు సమర్పించాలన్నారు.అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖలో నిర్వహిస్తున్న ఆయా అంశాలకు సంబంధించి వివరాలు అందించాలన్నారు.శాఖల మధ్య సమాచార మార్పిడి మరింత సమర్థవంతంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని వెయింగ్ బ్రిడ్జ్‌లను పన్ను చట్టాల పరిధిలోకి తీసుకురావడంలో లీగల్ మెట్రాలజీ శాఖ అందించిన సహకారాన్ని కలెక్టర్ అభినందించారు. అలాగే అక్రమ కార్యకలాపాల నియంత్రణకు అవసరమైన సమాచారాన్ని సంబంధిత దర్యాప్తు సంస్థలకు అందజేస్తున్నట్లు అధికారులు వివరించారు.ఇందుకు సంబంధించి పోలీసు శాఖ వివరాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
గత ఏడాది జి ఎస్ టి అమలులో ఏలూరు జిల్లా 95 శాతం లక్ష్యాలు సాధించి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచిందని, అదే స్ఫూర్తితో ఏడాది కూడా కృషి చేయాలన్నారు. జీఎస్టీ వసూళ్ల పెంపు, పన్ను ఎగవేతల నివారణ మరియు ప్రభుత్వ ఆదాయ వృద్ధి లక్ష్యాల సాధనలో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.
సమావేశంలో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమీషనరు బి. నాగార్జునరావు, జెడ్పి సిఇఓ పి. జగదాంబ, డిపివో జి.వి.కే. మల్లిఖార్జునరావు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.