జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఎరువుల సరఫరాపై అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా దిశా నిర్దేశం
ఏలూరు, జూలై , 2 : జిల్లాలో ఎరువులకు ఎటువంటి కొరతా లేదని, ఏపిఏఐఎంఎస్ యాప్ పై ప్రతీ రైతుకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఎరువుల పంపిణీపై గురువారం స్థానిక కలెక్టరేట్ నుండి వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, గ్రామ స్థాయి వ్యవసాయ శాఖ సిబ్బందికి టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువుల నిల్వలు ఉన్నాయన్నారు. రైతుల అవసరాల మేరకు ఎరువులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపిఏఐఎంఎస్ యాప్ పై రైతులందరికీ అవగాహన కలిగించాలన్నారు. ఈ-క్రాప్ ననుసరించి రైతులకు అవసరమైన మేరకు రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఎరువుల పంపిణీ చేయాలనీ, వ్యవసాయాధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. రైతుసేవా కేంద్రాల పరిధిలోని రైతులకు ఏపిఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందే విధానంపై అవగాహన కలిగించాలన్నారు. ఎరువుల నిల్వలను డీలర్లు తప్పనిసరిగా నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలన్నారు. ఎరువుల నిల్వలు అయిపోయే సమయానికి ముందుగానే ఇండెంట్ పెట్టెలా డీలర్లకు తెలియజేయాలన్నారు. జిల్లాలో ఎరువుల సరఫరాలో గతంలో ఎదుర్కున్న సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసి నిఘా పెట్టాలన్నారు. ఎరువులు అక్రమ నిల్వలు, రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేయాలనీ కలెక్టర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఎరువుల సరఫరాలో ఎక్కడ ఏ రైతు నుండైనా ఫిర్యాదు అందితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. రుణ అర్హత కార్డులు కలిగిన ప్రతీ కౌలు రైతుకి బ్యాంకు ద్వారా పంట రుణాలు అందించేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పచ్చారొట్టి విత్తనాలు అందించాలన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన మండల, గ్రామ స్థాయి అధికారులు, టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.