Close

నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446, ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 పై విస్తృత అవగాహన కలిగించాలి

Publish Date : 31/08/2026

ఏలూరు, ఆగష్టు, 31: మాదకద్రవ్యాల వినియోగం కారణంగా భవిష్యత్తు అంధకారం అవుతుందని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి జిల్లా స్థాయీ మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ సమావేశంలో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ద్వారానే వాటి వినియోగాన్ని నివారించవచ్చన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు జోలికి వెళ్ళితే భవిష్యత్తు అంధకారం అవుతుందని, యువతకు అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు మాదకద్రవ్య రహిత ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతిఒక్కరూ కృషిచెయ్యాలని సూచించారు. డి-అడిక్షన్ సెంటర్లలో పేషెంట్లకు అందిస్తున్న చికిత్సా విధానంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రతీ పాఠశాలలో ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు.

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ గంజాయి రహిత ఏలూరు నిర్మాణంలో భాగంగా ప్రతి ప్రభుత్వ శాఖ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజల్లో మాదకద్రవ్యాలుపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని, అలాగే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్లు – 1972కు సంబంధించిన స్టిక్కర్లను ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు ఇతర ప్రజా ప్రదేశాల్లో విస్తృతంగా ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో రవాణా శాఖాధికారి శేఖర్, డిపిఓ మల్లికార్జునరావు, డిఎంహెచ్ఓ డా. శోభ , ఆర్ అండ్ బి ఎస్ఈ విజయరత్నం, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ శారద, డిఎస్పి శ్రావణ్ కుమార్,విభిన్న ప్రతిభా వంతులు శాఖ సహాయ సంచాలకులు బి.రామకుమార్, ఈగిల్ టీమ్ ఇంచార్చి బి.ఉదయ భాస్కర్, పోలీసు అధికారులు, సంబంధిత శాఖలు అధికారులు, పాల్గొన్నారు.